: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యను 'శుభవార్త'గా పేర్కొన్న సీపీఎం నేత పుత్రరత్నం


కొన్ని రోజుల క్రితం కేరళలో కేటీ మనోజ్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు గురవడం తెలిసిందే. ఈ ఘటన అక్కడెంతో సంచలనానికి కారణమైంది. అయితే, మనోజ్ హత్యను 'గుడ్ న్యూస్' అంటూ సీపీఎం నేత జయరాజన్ కుమారుడు జైన్ రాజ్ పేర్కొనడం ఇప్పుడు వివాదాస్పదమైంది. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న జైన్ రాజ్ ఫేస్ బుక్ లో దీనిపై ఓ పోస్టు పెట్టాడు. 'చాలా కాలం నుంచి ఈ గుడ్ న్యూస్ వినాలని ఎదురుచూస్తున్నాను. వందనాలు కామ్రేడ్స్' అని ఆ పోస్టులో రాశాడు. మంగళవారం మధ్యాహ్నం 2.30కి పోస్టు పెట్టగా, స్వల్ప సమయంలోనే 1000 లైక్స్ వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పెట్టిన మరికొన్ని పోస్టుల్లో... 14 ఏళ్ళ క్రితం తన తండ్రిపై దాడి జరిగిందని, దాడికి పాల్పడినవారిలో మనోజ్ కూడా ఉన్నాడని జైన్ పేర్కొన్నాడు. కాగా, జైన్ ఫేస్ బుక్ పోస్టింగ్ లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బెదిరింపులతో కూడిన పలు కౌంటర్ పోస్టులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో, జైన్ తన 'గుడ్ న్యూస్' పోస్టును డిలీట్ చేయకతప్పలేదు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.మురళీధరన్ మాట్లాడుతూ, హత్య గురించి ఫేస్ బుక్ లో రాసిన వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. హత్యోదంతంలో అతని పాత్ర కూడా ఉండొచ్చన్న విషయాన్ని అతని ఫేస్ బుక్ రాతలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. హంతకులను అభినందించడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. కిందటివారం, కన్నూర్ జిల్లాలో మనోజ్ ను దుండగులు బాంబులు విసిరి, కత్తులతో నరికిచంపారు. దీనికి సంబంధించి ఆరుగురిపై కేసు నమోదైంది. వారందరూ సీపీఎం పార్టీకి చెందినవారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News