: అటు నటి మైత్రేయ, ఇటు రైల్వే మంత్రి తనయుడు... మధ్యలో మూడో వ్యక్తి!
రైల్వే మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ తనను మోసం చేశాడంటూ కన్నడ నటి మైత్రేయ ఆరోపించడం తెలిసిందే. ఇప్పుడీ వ్యవహారంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. మైత్రేయతో తనకు పదేళ్ళక్రితం వివాహం అయిందంటూ కన్నడ దర్శకుడు రిషి ఎంటరయ్యాడు. ఈ మేరకు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. 2004లో మైత్రేయ తాను దర్శకత్వం వహించిన 'సూర్య ది గ్రేట్' సినిమా ద్వారా చిత్రసీమలో ప్రవేశించిందని రిషి తెలిపాడు. ఆ సంవత్సరమే తాను ఆమెను పెళ్ళాడినట్టు వెల్లడించాడు. బెంగళూరులోని సన్మాన్ హోటల్లో ఆమెను పరిణయమాడానని, నాలుగు నెలల పాటు తాము అదే హోటల్లో ఉన్నామని వివరించాడు. అయితే, కొన్నిరోజుల తర్వాత మైత్రేయ తననుంచి రూ.2 లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందని తెలిపాడు. తాను ఆమె ఇంటికి వెళితే దూషించిందని, గెంటివేసిందని చెప్పాడు. మైత్రేయ 2007లో అంజన్ కుమార్ అనే ఓ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టిందని రిషి ఆరోపించాడు. కాగా, రిషి ఆరోపణలను మైత్రేయ ఖండించింది. 'సూర్య ది గ్రేట్' సినిమాలో నటించే నాటికి తనకు 16 ఏళ్ళు అని, తల్లి కూడా తనతో షూటింగ్ కు వచ్చేదని, ఆమెకు తెలియకుండా ఎలా వివాహం చేసుకుంటానని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, రైల్వే మంత్రి కుమారుడు సదానంద గౌడ కుమారుడు కార్తీక్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. రెండుసార్లు నోటీసులిచ్చినా ఫలితం లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించారు.