: ఒక్క ఫోన్ కాల్... నిశ్చితార్థాన్ని నిలిపేసింది!


అది పెద్దలు కుదిర్చిన సంబంధం. అమ్మాయితో పాటు అబ్బాయి కూడా మనస్ఫూర్తిగానే పెళ్లికి అంగీకరించాడు. ఇంకేముంది... పెళ్లి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. కుమార్తెకు పెళ్లి చేస్తున్నానన్న సంతోషంలో, ఆ తండ్రి స్థాయికి మించిన ఖర్చుతో పెళ్లికి ముందు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. అబ్బాయి, అమ్మాయి కూడా చక్కగా ముస్తాబయ్యారు. కొద్దిసేపుంటే ఇరువురూ తమ వేళ్లకు ఉంగరాలు మార్చుకుని భార్యాభర్తలుగా మారే క్రమంలో సగం క్రతువును ముగించేవారే. అయితే, ఉన్నట్లుండి అబ్బాయి సెల్ కు ఓ కాల్ వచ్చింది. అంతే, క్షణాల్లో అతడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఏమైందో తెలుసుకునేలోపే నిశ్చితార్థం కాస్తా నిలిచిపోయింది. అమ్మాయి తండ్రికి అప్పులు మిగిలాయి. డబ్బు పోయినా ఫరవాలేదు, కూతురికి పెళ్లి జరిగితే చాలనుకున్న ఆ తండ్రి అబ్బాయి కుటుంబాన్ని సంప్రదించాడు. నిశ్చితార్థం నుంచి అదృశ్యమైన యువకుడు ఇంటిలోనే నిశ్చింతగా ఉండటంతో అమ్మాయి తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఆ యువకుడు మొరాయించడంతో ఇక లాభం లేదనుకున్న అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారానికి కారణమైన ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఆ యువకుడు బయటికి చెప్పడం లేదు. ఇందులో యువకుడు మలక్ పేట కు చెందిన షౌకత్ కాగా, పెళ్లి కూతురు తండ్రి టోలిచౌకీ వాసి మహ్మద్ అబ్దుల్ రవూఫ్. జూన్ 15న నగరంలోని నజీర్ ఫంక్షన్ హాల్ నుంచి షౌకత్ అదృశ్యమయ్యాడు. బంజారాహిల్స్ పోలీసులు షౌకత్ పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ ఫోన్ కాలేమిటో, ఎక్కడి నుంచి వచ్చిందోనన్న వివరాలను ఆ యువకుడు అసలు బయటపెడతాడో, లేదో చూడాలి మరి.

  • Loading...

More Telugu News