: ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన ఆ ఎమ్మెల్యే క్షణాల్లో అప్రమత్తమై కాల్పుల నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని తన నివాసం వెలుపల బీజేపీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ షంటీ నిలుచున్నారు. అటుగా ఓ మోటార్ సైకిల్ పై శరవేగంగా దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై మెరుపు వేగంతో కాల్పులకు దిగారు. శరవేగంగా దూసుకొస్తున్న మోటార్ సైకిల్ ను గమనించిన జితేంద్ర సింగ్, ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. దుండగులు కాల్పులు జరపడానికి కొద్ది క్షణాల ముందు ఆయన పక్కకు తప్పుకున్నారు. దీంతో దుండగుల పిస్టళ్ల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ల నుంచి ఆయన తప్పించుకోగలిగారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు ఎమ్మెల్యే అప్రమత్తమైన నేపథ్యంలో అక్కడినుంచి పరారయ్యారు. ఎమ్మెల్యే నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.