: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్. దత్తు పేరు ఖరారు
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్ ఎల్ దత్తు పేరును ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోథా పంపిన ప్రతిపాదనకు పీఎంఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల కథనం. హెచ్.ఎల్. దత్తు పేరును తదుపరి సీజేఐగా ఖరారు చేసిన కేంద్రం, సదరు ఫైలును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనుమతి కోసం పంపింది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోథా ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుక్షణమే జస్టిస్ హెచ్.ఎల్. దత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దత్తు ఏడాదికిపైగా పదవీలో కొనసాగే అవకాశాలున్నాయి. 2015 డిసెంబర్ లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం 2జీ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి హెచ్ఎల్ దత్తు నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటకకు చెందిన హెచ్ఎల్ దత్తు, 2008 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.