: ఏపీ కొత్త రాజధాని విజయవాడే!


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందన్న అంశం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు చేయనున్న ప్రకటనతో తేలిపోనుంది. అయితే దినం, వర్జ్యం లెక్కలేసుకుంటున్న సర్కారు రాజధాని ప్రకటనను రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మంగళవారం చేసిన ప్రకటన రాష్ట్రంలో తీవ్ర చర్చకే దారి తీసింది. అదే సమయంలో నిన్నటిదాకా కృష్ణా జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని ప్రచారం సాగితే, తాజాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర కంటే అధికంగానే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయంటూ రెండు రోజులుగా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజధాని విజయవాడలోనే ఏర్పాటు కానుందన్న నిశ్చితాభిప్రాయం సర్వత్ర వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరు మెదపకపోవడం ఈ వాదనను మరింత బలపరుస్తోంది. అంతేకాక ఆది నుంచి విజయవాడనే రాజధానిగా ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు, కేంద్రం వద్ద తన పంతాన్ని నెగ్గించుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, రాజధాని నిర్ణయంపై తమ కేబినెట్ లో ఎలాంటి భేదాభిప్రాయం లేదని మంగళవారం తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. దీంతో కేబినెట్ లో నిన్నటిదాకా వినిపించిన భిన్న వాదనలకు ఇక తెరపడినట్లేనని భావిస్తున్నారు. కొత్త రాజదానిపై సీఎం ప్రకటన చేయనున్న తరుణంలో కేబినెట్ సహచరుల మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తం కాకూడదన్న భావనతోనే సీనియర్ మంత్రులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఏదైతేనేం, రేపటి సీఎం ప్రకటనలో రాజధానిపై వెల్లువలా సాగుతున్న చర్చకు తెరపడినట్లేనని రాష్ట్రంలో సాగుతున్న మెజార్టీ చర్చలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News