: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ!
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తనదైన శైలితో ప్రచారాన్ని నిర్వహించి ప్రత్యర్థులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, మరోమారు ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకోనున్నారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి. ఇటీవల బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారానికి మోడీ దూరంగానే ఉన్నారు. ఉప ఎన్నికల్లో మొత్తం 18 సీట్లలో కాంగ్రెస్, మిత్రపక్షాలు పది స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ మిత్రపక్షాలు ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మాత్రం బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిలో బీజేపీ నేతను కూర్చోబెడతామంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే అమిత్ షా కాశ్మీర్ లో జరిపిన పర్యటన విజయవంతమైంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అతిరథ మహారథులు పాల్గొననున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నాలుగు రాష్ట్రాల్లో కలిపి మోడీ, 10 నుంచి 12 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ, కాశ్మీర్ లలో ప్రధాని హోదాలో మోడీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నామమాత్రంగానే రాణిస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మోడీని ప్రచార బరిలో దింపేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దీపావళికి ముందే మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికలు ముగియనుండగా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.