: ధోనీ... వన్డేల్లో అత్యధిక మ్యాచ్ లను గెలిచిన కెప్టెన్!
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో వన్డే గెలవడంతో టీమిండియా కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ఇప్పటిదాకా మహ్మద్ అజహారుద్దీన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే విజయాల కెప్టెన్ రికార్డును ధోనీ బద్దలు కొట్టాడు. మొత్తం 91 వన్డేల్లో భారత్ ను విజయపథాన నడిపిన ధోనీ, టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా రికార్డు పుటలకు ఎక్కాడు. ఇప్పటిదాకా 90 విజయాలతో అజహరుద్దీన్ ముందువరుసలో ఉన్నాడు. మంగళవారం నాటి విజయంతో ధోనీ ఈ రికార్డును అధిగమించాడు. 174 మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన అజహరుద్దీన్ ఈ ఘనతను సాధిస్తే, కేవలం 162 మ్యాచ్ లలోనే ధోనీ, అతడి రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాక భారత్ ను 100 మ్యాచ్ లలో విజయపథాన నడిపే దిశగా ధోనీ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. తాజా రికార్డుతో పాటు ఇంగ్లండ్ పై అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గానూ ధోనీ రికార్డు నెలకొల్పాడు. బ్యాంటింగ్ లో నిలకడగా రాణిస్తున్న ధోనీ, అత్యధిక స్టంపింగ్ ల ద్వారా బ్యాట్స్ మన్ లను పెవిలియన్ పంపిన వికెట్ కీపర్ గానూ రికార్డు నెలకొల్పాడు.