: బీచ్ లో ఆడాళ్ల డ్రెస్సుల గోల ముగిస్తే... మగాళ్ల డ్రెస్సుల గోల మొదలైంది
గోవా బీచ్‌లలో మహిళల వస్త్రధారణపై తీవ్ర స్థాయి చర్చ ముగిసింది. తాజాగా పురుషుల వస్త్రధారణపై చర్చ మొదలైంది. నిన్నమొన్నటి వరకు యువతుల వస్త్రధారణపై వాడిగా వేడిగా మంత్రుల స్థాయి వ్యాఖ్యలతో వివాదం రేగగా, ఇప్పుడు పురుషుల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. బీచ్లలో పురుషులకు కూడా డ్రెస్ కోడ్ ఉండాలని ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైకేల్ లోబో డిమాండ్ చేయడంతో పురుషుల డ్రెస్ కోడ్ పై చర్చ మొదలైంది. గోవా బీచ్ లలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పురుషులకు వస్త్రధారణ కోడ్ ఉండాలని ఆయన సూచించారు. స్విమ్ సూట్ (ఈత కొట్టే సమయంలో వేసుకునేది) ధరించాలని, స్విమ్ సూట్ పేరిట అసభ్యకరంగా కనిపించే లో దుస్తులను అనుమతించరాదని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో పురుష యాత్రికులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్, దుబాయ్, మలేషియాల వలె గోవా బీచ్ లో డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో యువతుల బికినీలపై నిషేధించాలని ఓ మంత్రి డిమాండ్ చేయగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గోవా బీచ్ లలో బికినీ ధరించడంపై నిషేధం విధించడం లేదని ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.