: జపాన్, భారత్ మధ్య చాలా సారూప్యత ఉంది: మోడీ
జపాన్, భారత్ ల మధ్య చాలా సారూప్యత ఉందని ప్రధాని మోడీ తెలిపారు. టోక్యోలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు దేశాలు ప్రమాదకరమైన విపత్తులు సంభవించినప్పుడల్లా పైకెగసిన కెరటాల్లా తిరిగి లేచాయని అన్నారు. అలాగే హిరోషిమా వంటి ఘటనల పట్ల భారత్ లో ఎంతో సానుభూతి ఉందని ఆయన తెలిపారు. తన పర్యటన కారణంగా భారత్ లో లక్షా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. జపాన్ ప్రజలు చూపిన స్థైర్యం, తెగువ ఎనలేనిదని ఆయన తెలిపారు. ఆరు ప్రధాన ఉత్పత్తులపై జపాన్ నిషేధం ఎత్తివేసిందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో భారత్, చైనా, జపాన్ లు కొత్త శక్తులుగా ఎదుగుతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. "భవిష్యత్ భారత్ దా?, చైనాదా?, జపాన్ దా?, అనేది పక్కన పెడితే ఆసియాది అనేది సుస్పష్టం" అని ఆయన తెలిపారు. భారతీయ ప్రజల వాణి వినిపించేందుకు తాను జపాన్ వచ్చానని తెలిపిన మోడీ, తన పని తాను చేస్తున్నానని అన్నారు. వారణాసి పట్టణం వేద కాలం నుంచి ఉన్న నగరమైతే క్యోటో కూడా అత్యంత పురాతన నగరమని ఆయన పేర్కొన్నారు. వారణాసిలానే క్యోటోలో కూడా వందలాది దేవాలయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భారతీయ సంప్రదాయాల పట్ల చీరకట్టు, తలపాగా చుట్టడం, రుచికరమైన సంప్రదాయ వంటల పోటీలు పెట్టడం, దేశ భక్తులపై రచనలు చేయడం వంటి పోటీలు పెట్టి పిల్లల్లో అవగాహన కల్పించవచ్చని ఆయన ప్రవాస భారతీయులకు సూచించారు.