: 800 ఏళ్ల తరువాత తిరిగి క్లాసులు ప్రారంభమయ్యాయి
ప్రపంచానికి చరిత్ర పాఠాలు నేర్పిన నలందా యూనివర్సిటీలో మళ్లీ తరగతులు ప్రారంభమయ్యాయి. బీహార్ లోని రాజ్ గిరిలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నలందా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. 800 ఏళ్ల క్రితం వివిధ రాజ్యాలకు చెందిన మేధావులు ఇక్కడ విద్య నేర్చుకున్న వారేననడంలో అతిశయోక్తి లేదు. అలాంటి నలంద విశ్వవిద్యాలయం 9 ఏళ్ల కృషి తరువాత తిరిగి ప్రారంభమైంది. చరిత్ర, పర్యావరణం విభాగాల్లో కేవలం 15 మంది విద్యార్థులతో నలంద యూనివర్సిటీ 800 ఏళ్ల తరువాత తిరిగి ప్రారంభమైంది. వీరిలో 9 మంది తొలి రోజు యూనివర్సిటీ తరగతులకు హాజరయ్యారు. వీరిలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. విద్యార్థులతో పాటు ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వీసి గోపా సభర్వాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనివర్సిటీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలపై సమీక్ష కోసం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ నెల 14న యూనివర్సిటీకి వస్తారని ఆయన చెప్పారు. వివిధ విభాగాల్లో చేరికకు 35 దేశాల నుంచి 1400 దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు. సరైన ప్రచారం లేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఆయన వెల్లడించారు.