: జపాన్ పర్యటనలో చైనాపై విరుచుకుపడ్డ మోడీ
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ చైనాపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో, 21వ శతాబ్దంలో వికాస (అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ముక్కచెక్కలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బుద్ధుడి మార్గంలో నడుస్తూ, వికాసంపై నమ్మకం ఉన్న దేశాలే అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పటికీ కొన్ని దేశాలు( చైనాను ఉద్దేశించి) ఇతర దేశాల భూభాగాలు, సముద్రప్రాంతాలు తమవేనంటూ చొరబడుతున్నాయని మోడీ విమర్శించారు. 18వ శతాబ్దంలో రాజులు విపరీతమైన రాజ్యకాంక్షతో పరాయి దేశాలను ఆక్రమించుకునేవారని... అలాంటి విపరీత కాంక్ష ప్రస్తుతం మన చుట్టుప్రక్కల ఉన్న ఓ దేశంలో కనపడుతోందని మోడీ చురకంటించారు. విస్తరణ వాదం ఎప్పటికీ ప్రజలకు మేలు చేకూర్చలేదని ఆయన అభిప్రాయపడ్డారు. భూ, సముద్ర సరిహద్దుల విషయంలో జపాన్, భారత్, వియత్నాం, మలేషియా వంటి దేశాలతో చైనా అనుసరిస్తున్న నియంతపోకడల్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఈ పరోక్ష విమర్శలు చేశారు.