: విశ్వభారతీ వర్సిటీలో లింగ వివక్ష: వీసీపై మహిళా ఉద్యోగి ఆరోపణ
జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ పేరిట వివస్త్రను చేసి ఫొటోలు తీసిన సీనియర్ విద్యార్థుల దారుణం వెలుగు చూసిన కోల్ కతాలోని విశ్వభారతిలో తాజాగా వైస్ ఛాన్సలర్ పైనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్సిటీ ఉద్యోగులపై లింగ వివక్షను ప్రదర్శించే వీసీ, తనకు నచ్చని వారిపై అకారణంగా బదిలీ వేటు వేస్తున్నారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. మహిళనైన తనను రెండేళ్లలో నాలుగు సార్లు బదిలీ చేసిన వీసీ సుశాంత దత్తగుప్తా, తన లింగ వివక్షను చాటుకున్నారని ఆ ఉద్యోగి ఏకంగా రాష్ట్రపతి, ప్రధాని, హెచ్ ఆర్ డీ మంత్రి, పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు. తనను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో అసలు తనను ఎందుకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బదిలీల్లో భాగంగా రెండు బదిలీలు కేవలం 24 గంటల్లో జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవలే దత్తగుప్తాపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలతో పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన పేరును మోడీ సర్కారు తొలగించిన సంగతి తెలిసిందే.