: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కదులుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. తెలంగాణలోని పరిగిలో అత్యధికంగా 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సిర్పూరులో 8, ఎల్లారెడ్డి, తాండూరులో 7, ఆసిఫాబాద్, కామారెడ్డి, మద్దూరు, గంభీరావుపేట, మెదక్ లో 5 సెం.మీ. చొప్పున వర్షపాతెం నమోదైంది. కోస్తాంధ్రలోని సోంపేటలో 6 సెం.మీ, విశాఖ, చింతపల్లి, తునిలో 5 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.