: 'అత్తారింటికి దారేది' నటుడికి అండర్ వరల్డ్ బెదిరింపులు
'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో, ఆయనకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి ఇరానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందుకే, ఆయనకు భద్రత కల్పిస్తున్నామని ముంబయి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులకు మాఫియా బెదిరింపులు వస్తున్నాయి. నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట కొందరు కాల్పులు కూడా జరిపారు. షారూఖ్ ఖాన్ కు సైతం బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఇరానీకి అదే తరహాలో ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. ఇరానీ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కల్యాణ్ కు తాతగా నటించారు.