: జపాన్ ప్రధానితో మోడీ శిఖరాగ్ర సదస్సు నేడే


జపాన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ కీలక సమావేశంలో 'టూ ప్లస్ టూ' భద్రతా సంప్రదింపుల కార్యాచరణకు సంబంధించి రెండు దేశాలు ఓ అంగీకారానికి రానున్నాయి. ఐదు రోజుల పర్యటనకు జపాన్ చేరిన మోడీ ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించే నగరం క్యోటోలో తొలి రెండు రోజులు గడిపారు. అక్కడి దేవాలయాలను సందర్శించారు, మత పెద్దలతో మాట్లాడారు, చిన్నపిల్లలతో సందడి చేశారు. పర్యాటకుల్ని అలరించారు. క్యోటో విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూల కణ పరిశోధనలను ఆసక్తిగా పరిశీలించారు. భారత గిరిజనుల్లో కనిపించే సికిల్ సెల్ ఎనీమియాపై పరిశోధన చేయాలని అక్కడి పరిశోధకులను కోరారు. కాగా, మోడీకి జపాన్ ప్రధాని పూర్తి సమయాన్ని కేటాయించారు. దీనిపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. దీంతో, నేడు జరగనున్న చర్చల్లో పురోగతి లభిస్తుందని, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత ధృఢంగా మారతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుల్లెట్ రైళ్లు, అణువిద్యుత్ వంటి అంశాల్లో జపాన్ సానుకూలంగా స్పందిస్తుందని వారు భావిస్తున్నారు. నేడు జరగనున్న కీలక శిఖరాగ్ర సదస్సులో ప్రధానులతో పాటు పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొంటుండడం విశేషం.

  • Loading...

More Telugu News