: ఆరేళ్లలో 25 లక్షల కోట్లు మళ్లించేశారు
అవినీతి పరులు జాగ్రత్త పడుతున్నారు. భారీ ఎత్తున స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనానికి రెక్కలు వస్తున్నాయి. భారత్ సహా ప్రపంచ దేశాల్లోని నల్లకుబేరులను బయటపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, నల్లధనం వెలికితీతపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం కరిగిపోతోంది. గత ఆరేళ్లలోనే దాదాపు రూ. 25 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు స్విట్జర్లాండ్ బయటకు తరలిపోయాయని ప్రముఖ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) తెలిపింది. ఇందులో భారతీయ నల్లకుబేరుల డబ్బు ఎంతన్న సమాచారంపై స్పష్టత లేదు. స్విట్జర్లాండ్‌లోని 90 ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ ప్రైవేట్ క్లయింట్ల లావాదేవీలను విశ్లేషించిన ఈ సంస్థ, దాదాపు రూ. 25 లక్షల కోట్ల నిధులను స్విస్ బ్యాంకుల నుంచి పలు రూపాల్లో స్వదేశాలకు లేదా, ఇతర దేశాలకు తరలించినట్టు నిర్థారించింది. ప్రపంచ దేశాల ఒత్తిడితో స్విస్ బ్యాంకులు నిబంధనలు కఠినం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నల్లధనం తరలడం లేదని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. భారతీయులు దాచుకున్న నల్లధనం నిల్వలు కూడా తరిగిపోతున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.