: అంతా మీ ఇష్టమేనా..?: గురు ఉత్సవ్ ప్రకటనపై కరుణానిధి మండిపాటు


మోడీ సర్కారు తీరుపై డీఎంకే అధినేత కరుణానిధి మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం పేరును గురు ఉత్సవ్ గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏళ్ల నుంచి ఉపాధ్యాయ దినోత్సవం పేరిటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడేమో కేంద్రం గురు ఉత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహించమని ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మా భాషను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. భాషతోనే అత్యున్నత శిఖరాలు చేరుకున్న వారి ప్రతిష్ఠను ఇలాంటి చర్యలు కించపరిచేవే.’’ అంటూ ఆదివారం చెన్నైలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సంస్కృతం వారోత్సవాల నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈ జారీ చేసిన ఉత్తర్వులపైనా కరుణానిధి మండిపడ్డారు. కేంద్రంతో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు హిందీని వినియోగించాలన్న విషయంలోనూ ఇటీవలి మోడీ సర్కారు వైఖరిపై తమిళనాడు పార్టీలన్నీ ఒంటికాలిపై లేచిన సంగతి తెలిసిందే. బీజేపీ మిత్ర పక్షం ఎండీఎంకే, పీఎంకేలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా నాడు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ‘‘ఆ ఆదేశాలు కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలకే’’ నంటూ కేంద్రం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News