: ప్రాణాంతక వ్యాధిపై ఉమ్మడి పోరు... మోడీ ప్రతిపాదనకు జపాన్ అంగీకారం
భారతదేశంలో ప్రధానంగా గిరిజనులను పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి సిికిల్ సెల్ ఎనీమియాను సమూలంగా నిర్మూలించేందుకు ఉమ్మడి కార్యాచరణ చేపడదామన్న భారత ప్రధాని మోడీ ప్రతిపాదనకు జపాన్ అంగీకరించింది. జపాన్ పర్యటనలో భాగంగా ఆదివారం క్యోటో నగరంలో పర్యటించిన ప్రధాని మోడీ, అక్కడి స్టెమ్ సెల్స్ రీసెర్చ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, 2012లో వైద్యరంగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న జపాన్ శాస్త్రవేత్త ఎస్. యమనకను కలిశారు. యమనకతో సికిల్ సెల్ ఎనీమియా గురించి సుదీర్ఘంగా చర్చించారు. సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించేందుకు అవసరమైన చర్యల రూపకల్పనలో భారత్ తో కలిసి పనిచేయగలరా? అంటూ కూడా మోడీ ఆయనను అడిగారు. వెనువెంటనే స్పందించిన యమనక, జపాన్ ప్రధాని షింజో అబేలు మోడీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. దీంతో, ఈ వ్యాధికి త్వరలోనే చెక్ పడుతుందన్న భావన మోడీ మోములో కనిపించింది. మోడీ పర్యటన ముగిసేలోగా దీనికి సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.