: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండో ఏడాది సింధుకు కాంస్యం


ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు తీవ్ర ఒత్తిడికి లోనయ్యి 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్‌లు నెట్‌కు తగిలాయి. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో ఏడాది కూడా (నిరుడు బరిలో దిగిన తొలిసారే సింధు కాంస్యం దక్కించుకుంది) ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో కాంస్యం గెలుచుకుని భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సింధు లిఖించింది. ప్రపంచలోని మేటి షట్లర్లు అత్యంత భీకరంగా పోరాడే టోర్నమెంట్ ప్రపంచ బ్యాడ్మింటిన్ ఛాంపియన్ షిప్. ఇలాంటి టోర్నమెంట్ లో వరుసగా రెండో ఏడాది కూడా కాంస్యం సాధించడమంటే మామూలు విషయం కాదు. సింధు కన్నా ముందు కేవలం రెండు సార్లు మాత్రమే భారత్ ఈ టోర్నమెంట్ లో పతకాలు సాధించింది. 1983లోనే ప్రకాష్ పదుకొనే ఈ టోర్నమెంట్ లో కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2011లో గుత్తా జ్వాల, అశ్వనీ పొన్నప్పలు డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచారు.

  • Loading...

More Telugu News