: విశ్వభారతి కీచకులపై సస్పెన్షన్ వేటు


విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ పరిధిలోని విశ్వభారతి వర్సిటీలో జూనియర్ విద్యర్థినిని ర్యాగింగ్ పేరిట లైంగిక వేధింపులకు గురి చేసిన ముగ్గురు సీనియర్ విద్యార్థులపై వర్సీటి ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. ముగ్గురు కీచక విద్యార్థులను సస్పెండ్ చేస్తూ శనివారం వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు దుండగులను అరెస్ట్ చేశారు. ర్యాగింగ్ పేరిట జూనియర్ విద్యార్థినిని పిలిచిన ముగ్గురు సీనియర్ విద్యార్థులు ఆమెపై లైంగిక వేధింపులకు దిగడమే కాక దుస్తులు విప్పదీయించి, నగ్నంగా ఫొటోలు తీశారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు రూ.4 వేలను డిమాండ్ చేశారు. డబ్బులివ్వకపోతే నగ్న ఫొటోలను నెట్ లో పెడతామంటూ బెదిరించారు. దీనిపై పక్షం రోజులుగా తర్జనభర్జన పడ్డ బాధిత విద్యార్థిని తండ్రి రాకతో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వేగంగా స్పందించాల్సిన అధికారులు విద్యార్థినిని అవమానపరిచే విధంగా వ్యవహరించడంతో శనివారం దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం రేపింది. దీంతో స్పందించక తప్పని అధికారులు, ముగ్గురు సీనియర్ విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వర్సిటీలో అంతర్గత విచారణ నిర్వహించిన తర్వాత కీచక విద్యార్థులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వైస్ ఛాన్సలర్ ప్రతినిధి వెల్లడించారు.

  • Loading...

More Telugu News