: రక్షణ రంగంలో మోడీ 'మేక్ ఇన్ మంత్ర' తొలి అడుగు!
ప్రధానిగా మోడీ ప్రమాణం చేసిన తర్వాత దేశ రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమైంది. దేశ రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడుల ద్వారా దేశ భద్రతకే ముప్పు వాటిల్లనుందన్న ఆందోళనలు రేకెత్తాయి. అయితే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో 'మేక్ ఇన్ ఇండియా' ఈ అనుమానాలను కొంతమేర పారదోలగలిగింది. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం మరింత భరోసాను కల్పించడమే కాక భారత పారిశ్రామిక రంగానికి కొత్త జవసత్వాలను ఇవ్వనుంది. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మోడీ సర్కారు తొలుత రక్షణ రంగానికే వర్తింపజేసింది. రక్షణ శాఖ వినియోగించే తేలికపాటి హెలికాఫ్టర్లను ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోరాదని తీర్మానించింది. అంతేకాక సదరు హెలికాఫ్టర్లను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఇప్పటికే ఈ విషయంలో విడుదలైన గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో హెలికాఫ్టర్ల కొనుగోలు పేరిట విదేశీ కంపెనీలకు దక్కే, రూ. 20 వేల కోట్ల కాంట్రాక్టు దేశీయ కంపెనీలకు అందివచ్చేందుకు రంగం సిద్ధమైంది. రక్షణ శాఖ వినియోగించే పలు విడిభాగాల తయారీకి టాటా, రిలయన్స్, మహీంద్రా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హెలికాఫ్టర్ల తయారీకి సంబంధించి టాటాకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చినట్లు సమాచారం. మున్ముందు కూడా మోడీ 'మేక్ ఇన్ ఇండియా' మంత్రం దేశీయ కంపెనీలకు వరంగా మారే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.