: నేటి నుంచి ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్
ఎట్టకేలకు ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగానే జరగనున్న ఈ కౌన్సెలింగ్ శనివారం ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నేటి ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కౌన్సెలింగ్ కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఐదు ఆన్ లైన్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాదులోని జేఎన్టీయూ, వరంగల్ లోని కాకతీయ వర్శిటీలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా... ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ, విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీల్లో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆన్ లైన్ లో జరగనున్న ఈ కౌన్సెలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే నెల 5 దాకా కొనసాగనున్న కౌన్సెలింగ్ లో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ తదితర కోర్సుల్లో ఎంసెట్ అభ్యర్థులకు ప్రవేశాలు దక్కనున్నాయి.