: సీపీఎంతో మమత చేతులు కలపనుందా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మరో కొత్త రాజకీయ బంధానికి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంలు భవిష్యత్తులో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే రోజులను కొట్టిపారేయలేం. ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన సమాధానాలు కొత్త బంధానికి తెరలేపే విధంగా ఉన్నాయి. "సీపీఎంతో మేము చేతులు కలుపుతామని స్పష్టంగా చెప్పలేం. అయితే, ఈ ప్రతిపాదనపై పార్టీలో కూలంకషంగా చర్చ జరగాల్సి ఉంది. అన్నీ అనుకూలంగా ఉంటే, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు" అని మమత తెలిపారు. ఈ విషయంలో తమ పార్టీ నేతల అభిప్రాయాలు చాలా ముఖ్యమని ఆమె అన్నారు. దీంతో, భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లకు మమత శుభాకాంక్షలు తెలిపారు.