: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో 25 మంది భారతీయుల అరెస్టు
ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో 25 మంది భారతీయులను కువైట్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయులను రక్షించాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్లకు అక్కడి భారతీయులు, అరెస్టయిన వారి సహోద్యోగులు సంక్షిప్త సందేశాలు పంపారు. తాము పని చేస్తున్న సంస్థలోనే తమను నిర్బంధించి వేధిస్తున్నారని వారు సంక్షిప్త సందేశాల్లో పేర్కొన్నారు. కాగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఇద్దరు ఈజిప్షియన్లు మృతి చెందారు. దానికి బాధ్యులుగా 25 మంది భారతీయులను అరెస్టు చేసి మరో 500 మంది కార్మికులను సంస్థలోనే నిర్బంధించారు. వీరిలో చాలా మంది పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారని సమాచారం. దీని తరువాత 15 మంది భారతీయులను ఆసుపత్రిలో చేర్చడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు వారిని పరామర్శించారని కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. కువైట్లో దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులున్నారని, వాళ్లంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. అయితే.. భారతీయులు ఎక్కడున్నా అక్కడి స్థానిక చట్టాలకు కూడా కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.