: దుమారం రేపుతున్న ఆరోగ్యమంత్రి గారి 'అనారోగ్య' వ్యాఖ్యలు


రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలు రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత నేతలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. ప్రతి అంశంపైనా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఆదరణ పెంచుకుంటున్నారు. కొందరు మాత్రం తమ వ్యాఖ్యలతో తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. నజ్మాహెప్తుల్లా హిందూ దేశం అంటూ వ్యాఖ్యలు చేసి వివాదం రేపితే, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అత్యాచారం అనేది చాలా చిన్న విషయమంటూ వివాదం రేపారు. ఇది చల్లారిందని భావించేంతలో ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ మరో వ్యాఖ్య చేసి దుమారం రేపారు. ''మహిళ శరీరం దేవాలయం లాంటిది. ఒక కొత్తతరాన్ని రూపొందించాలంటే ఆరోగ్యవంతులైన మహిళలు అవసరం. వాళ్లే అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, జాతిమీద కూడా పడుతుంది'' అని ఆయన సెలవిచ్చారు. ఢిల్లీలోని ఓ మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణ యువతుల్లో ఇటీవలి కాలంలో అనారోగ్యాలు ప్రబలిపోతున్నాయని పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీనిపై ట్విట్టర్లో పెను దుమారమే రేగింది. యూజర్లు దీనిపై నిప్పులు చెరిగారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన భాషను సంస్కరించుకోవాలంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News