: చైనా షట్లర్ కు తలవంచిన సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి చైనా అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. డెన్మార్క్ లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సైనా క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. చైనా స్టార్, టాప్ ర్యాంకర్ లి ఝురీతో పోరులో సైనా 15-21, 15-21తో ఓటమిపాలైంది. కాగా, ఈ ఇద్దరి నడుమ ఇది పదో పోరు కాగా, ఎనిమిదిసార్లు ఝురీనే నెగ్గి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇదిలావుంటే, ఈ మ్యాచ్ కు ముందు ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. టోర్నీల్లో చైనా షట్లర్లు ఎక్కువగా పాల్గొంటున్నారని, ఒక్క షట్లర్ కు వ్యతిరేకంగా ఎందరో చైనా షట్లర్లు రంగంలోకి దిగుతున్నారని సైనా ఆరోపించింది. ఒక్కో దేశం నుంచి ముగ్గురు షట్లర్లకే అనుమతివ్వాలని సూచించింది. దీనికి చైనా అమ్మాయి ఝురీ బదులిస్తూ, సైనా మొదట తనపై గెలవాలని సవాల్ విసిరింది. ఆ తర్వాతే ఈ విషయం మాట్లాడదామని ధీమాగా పేర్కొంది. దేశానికి ముగ్గురే ప్రాతినిధ్యం వహించినా, ఆమెలో సత్తా లేకపోతే నెగ్గలేదని విమర్శించింది. అది ఆమె సమస్యే అని ఝురీ స్పష్టం చేసింది.