: ఫేస్ బుక్ పోస్టింగ్ తెచ్చిన తిప్పలు!
ఫేస్ బుక్ ఇప్పుడు సమాజంలోకి బాగా చొచ్చుకునిపోయింది. ప్రతి స్పందనను ఫేస్ బుక్ ద్వారా వెల్లడిస్తున్నారు. 'నేను దుఃఖంగా ఉన్నానని భావిస్తున్నాను', 'నేను వెర్రిగా ఉన్నానని అనుకుంటున్నాను' 'చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ సాగే భావవ్యక్తీకరణలు ఈ సోషల్ నెట్ వర్క్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాజిక అంశాలపై జనాల రియాక్షన్లు సరేసరి. తమ దృష్టిలో పడిన ప్రతి అంశాన్ని ఏకిపారేస్తున్నారు. అయితే, అలా చేసిన కొందరు చిక్కుల్లో పడడం మనం చూశాం. ఈ అమెరికా మహిళ కూడా అలానే ఇబ్బందుల్లో పడింది. తన కుమారుడు చదువుతున్న స్కూల్ గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టింది. "స్కూల్లో రోజూ ఏదో ఒక విషయంలో తప్పులు కనిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా?, లేక, నేనేమైనా అతిగా ఆలోచిస్తున్నానా?" అంటూ ఆ పోస్టింగులో పేర్కొంది. ఆ మరుసటి రోజే ఆమెకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి ప్రిన్సిపాల్ ను కలవాలన్నది ఆ కాల్ సారాంశం. అంతేగాకుండా, ఆమె కుమారుడిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. సదరు ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా స్కూల్ సిబ్బందిని కించపరిచినట్టయిందని తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ, విద్యార్థిగా తన కుమారుడు, తల్లిదండ్రులుగా తాము తగనివారమని స్కూల్ యాజమాన్యం భావిస్తున్నట్టుందని ఆవేదన వ్యక్తం చేసింది.