: వెన్నునొప్పి కారణంగా మెదక్ ఉపఎన్నికల ప్రచారం నుంచి పవన్ కల్యాణ్ ఔట్!
మెదక్ ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ ను స్టార్ క్యాంపెయినర్ గా భావిస్తోన్న టీడీపీ-బీజేపీ వర్గాలకు షాక్ తగిలింది. ఉపఎన్నిక కోసం పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడం లేదని బీజేపీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో పవన్ కల్యాణ్ ప్రచారం ద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఆశ అడియాశ అయినట్టే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలప్పుడు పవన్, కేసీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ నేపధ్యంలో... పవన్ ప్రచారానికి వచ్చి టీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తే తమ ఎలక్షన్ క్యాంపెయిన్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని వారు తొలుత భావించారు. జగ్గారెడ్డి ప్రధాన అనుచరులు ఇచ్చిన సమాచారం ప్రకారం... పవన్ ను ఉపఎన్నికల ప్రచారానికి రావాలని జగ్గారెడ్డి ఇప్పటికే ఆహ్వానించారట. అయితే తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా తాను బెంగళూరులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని... ఈ కారణంగా సెప్టెంబర్ 13లోపు తాను హైదరాబాద్ రాలేనని పవన్ జగ్గారెడ్డికి మెసేజ్ పెట్టారని వారు చెబుతున్నారు. అయితే మెదక్ ఉపఎన్నికలో జగ్గారెడ్డి ప్రచార బాధ్యతలు చూసుకుంటున్న అల్లూరి బాలకృష్ణంరాజు మాత్రం పవన్ కల్యాణ్ ప్రచారంపై ఆశలు కోల్పోలేదు. పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడంలేదన్న సమాచారాన్ని కొట్టిపారేయలేమని...అియితే ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రెండు రోజులైనా ఆయనను తీసువచ్చే ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ మెదక్ ఉపఎన్నికల ప్రచారానికి వస్తే సమీకరణాలు మారే అవకాశం ఉందనే ఆలోచనతోనే టీఆర్ఎస్ ఆయనపై హఠాత్తుగా విమర్శల దాడి ప్రారంభించిందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత నిన్న పవన్ మైండ్ ఇప్పటికే బ్లేంక్ అయ్యిందని... ఆయనను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం మానేశారని వ్యాఖ్యానించగా... ఓయూ జేఏసీ నేతలు పవన్ ప్రచారానికి వస్తే రాళ్లు విసురుతామని హెచ్చరించారు.