: విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్న విఘ్నాధిపతి


వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో విఘ్నేశ్వరుడు విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. హైదరాబాదు బడంగ్ పేట్ లోని లార్డ్స్ పాఠశాల విద్యార్థులు పండ్లు, కూరగాయలతో వినాయకుడిని తయారుచేశారు. గుమ్మడికాయ, పొట్లకాయ, నిమ్మకాయ, క్యారట్, పూలతో అలంకరించి గణేశ్ ప్రతిమను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నిజాంపేట ఎక్స్ రోడ్ జేఎన్టీయూ సమీపంలోని సాయినగర్ కాలనీలోని పినాకిల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వినూత్న గణపతిని రూపొందించారు. మైదా, ఉప్పుతో ఐదున్నర అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారుచేసి, దానిపై ఐదు రకాల పప్పు ధాన్యాలు, పది రకాల పాస్తా గింజలతో అలంకరించారు. బాలానగర్ లోని శ్రీసూర్య శుభకర విఘ్న వినాయక సంస్థ ఆధ్వర్యంలో టిష్యూ పేపర్ గణేశుడిని తీర్చిదిద్దారు. 50 వేల టిష్యూ పేపర్లతో 15 అడుగుల ఎత్తు, 80 కిలోల బరువుతో రూపొందించారు. ఇందుకోసం 15 రోజుల పాటు కృషి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ కపాడియా లైన్ లో జై గణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా పర్యావరణ గణేశుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి ఎండుగడ్డితో చేసిన ఏకదంతుడు చూడముచ్చటగా కన్పిస్తున్నాడు. ఎండు గడ్డితో చేసిన ప్రతిమకు సహజ రంగులు అద్దారు. రాయదుర్గం ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో చిన్నారులు కలర్స్ క్లేతో తయారుచేసిన వినాయక విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ఆవరణలోని వినాయక విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News