: దాసరి కొడుకుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కుమారుడు తారక్ ప్రభుపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. న్యాయస్థానం ఆదేశించిన భరణం చెల్లించలేదని తారక్ ప్రభు భార్య సుశీల కోర్టులో ఫిర్యాదు చేయడంతో నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తనకు, పిల్లలకు జీవనభృతి నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని సుశీల కోరడంతో న్యాయస్థానం భరణం చెల్లించాలని ఇంతకు మునుపు ఆదేశించింది. కొంత కాలం భరణం చెల్లించిన తారక్ ప్రభు తరువాత ఇవ్వడం మానేశారు. భరణం బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, భరణం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై సుశీల హైకోర్టుకు వెళ్లారు. రీకాల్ పిటిషన్ ఉత్తర్వులను నిలుపుదల చేసిన హైకోర్టు, తారక్ ప్రభును అరెస్టు చేయాలంటూ ఆదేశించింది.