: దసరా నుంచి హైదరాబాద్ లో కల్లు దుకాణాల పున:ప్రారంభం
దసరా నుంచి జంటనగరాల్లో కల్లు దుకాణాలను పున:ప్రారంభిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. కల్లు దుకాణాలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసిందని ఆయన చెప్పారు. జంట నగరాల్లో కల్లు దుకాణాలను తిరిగి ప్రారంభించడం టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ఒకటి. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దుకాణాల పునరుద్ధరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై కమిటీ ప్రభుత్వానికి త్వరలో నివేదికను అందించనుంది. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పదుల సంఖ్యలో ఉన్న కల్లు సహకార సంఘాల ఆధ్వర్యంలో 120 దుకాణాలు వరకు నడిచేవి. చెట్ల సంఖ్య ఆధారంగా సొసైటీలకు దుకాణాల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ సొసైటీకి చెట్లను కూడా ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. కల్లును తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. అయితే గతంలో పోలిస్తే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తాటి చెట్లతో పాటు ఈత చెట్ల సంఖ్య కూడా భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న చెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని సహకార సంఘాలకు, దుకాణాలకు అనుమతులు ఇస్తుందో అన్న విషయం సస్పెన్స్ గా మారింది.