: జగన్ పెరిగిన తీరే వేరే విధంగా అనిపిస్తోంది: అసెంబ్లీలో యనమల
బడ్జెట్ పై ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల విపక్షనేత జగన్మోహన్ రెడ్డి వాకౌట్ పై వ్యంగ్యభరితమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ హౌస్ ను తన 'హౌస్' అనుకుంటున్నారని... అందుకే ఇక్కడ ఆయన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిసున్నారని అన్నారు. 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని... ఇప్పటివరకు జగన్ లాంటి ప్రతిపక్ష నేతను తాను చూడలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేతైనా ప్రజా సమస్యల కోసం అధికార పక్షాన్ని నిలదీసి... సభ నుంచి వాకౌట్ చేసేవారని ఆయన అన్నారు. కానీ అందుకు పూర్తివిరుద్దంగా జగన్ ఏ కారణం లేకుండా వాకౌట్ చేస్తున్నారన్నారు. వాకౌట్ చేసేటప్పుడు సభ్యులు ఎందుకు వాకౌట్ చేస్తున్నామో స్పీకర్ కు చెప్పి... వాకౌట్ చేస్తారని... అది సభామర్యాద అని... కానీ, జగన్ కనీసం వాకౌట్ చేస్తున్నానన్న విషయం స్పీకర్ కు చెప్పకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ బయటకు వెళుతుంటే... మిగతా వైసీపీ సభ్యులు ఆయనను సైలెంట్ గా అనుసరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జగన్ పెరిగిన తీరే వేరే విధంగా ఉందని అనిపిస్తోందని యనమల ఘాటుగా వ్యాఖ్యానించారు.