: కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో 12వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం లభ్యం


విజయవాడ శివారు ప్రాంతం లక్ష్మీపురంలోని కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో తవ్వకాలు జరుపుతుండగా, ఓ వినాయక విగ్రహం బయల్పడింది. దీంతో, ఇక్కడ కొద్దిరోజుల ముందే పండుగ వాతావరణం నెలకొంది. కాగా ఈ విగ్రహం 12వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం ఎర్త్ మూవర్ తో తవ్వకాలు జరుపుతుండగా, శబ్దం రావడంతో ఆపరేటర్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. శబ్దం వచ్చిన ప్రదేశంలో పరిశీలించగా, అక్కడో రాతి ఆకృతి కనిపించింది. దానిచుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూడగా అదో గణనాథుడి విగ్రహం అని తేలింది. ఆ విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉందని కేసీపీ షుగర్స్ సీఈఓ జి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు విరామం ప్రకటించి, గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. అనంతరమే పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. కాగా, విగ్రహం విషయమై ఆర్కియాలజీ విభాగం అసిస్టెంట్ డైరక్టర్ కె.చిట్టిబాబు మాట్లాడుతూ, ఇది 12వ శతాబ్దం నాటిదని, చాళుక్యుల శైలి శిల్పకళా నైపుణ్యంతో దీన్ని రూపొందించారని తెలిపారు. గ్రానైట్ రాయితో ఇది తయారైందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News