: కొత్త ఆవిష్కరణల టేకోవర్ పై ఇన్ఫోసిస్ ఆసక్తి


ప్రస్తుతం వివిధ రంగాల్లో సరికొత్త రీతిలో రంగప్రవేశం చేసి, భారీ ఆదాయాలతో దూసుకుపోతున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దన్నుగా నిలిచేందుకు ఇన్ఫోసిస్ ఆసక్తి చూపుతోంది. సరికొత్త ఐడియాలతో మార్కెట్ ను మంత్రముగ్ధలను చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక దన్ను ఇవ్వాలన్న యోచనతో పాటు సదరు కంపెనీలను టేకోవర్ చేసేందుకు ఇన్ఫీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్, వెంచర్ కేపిటలిస్ట్ లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన, ఇలాంటి ఏడు సంస్థలను గుర్తించారట. ఈ విషయంలో ఇన్ఫీ కంటే విప్రో ముందంజలో ఉంది. ఇప్పటికే ఎక్సెడా కార్ప్, ఒపెరా సొల్యూషన్స్ తదితర కొత్త కంపెనీల్లో అజీమ్ ప్రేమ్ జీ పెట్టుబడులు పెట్టారు. ఫ్లైటీఎక్స్ టీ, 99 టెస్ట్స్, అవెక్షా టెక్నాలజీస్ వంటి సంస్థల్లోనూ వాటా తీసుకునే దిశలో ప్రేమ్ జీ చర్చలు జరుపుతున్నారు. కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్న ఇన్ఫోసిస్, గతేడాది ఇందుకోసం 100 మిలియన్ అమెరికన్ డాలర్లతో ప్రత్యేకంగా ఓ నిధినే ఏర్పాటు చేసింది. ఎడ్జ్ వెర్వ్ సిస్టమ్స్ పేరిట పూర్తి సబ్సిడరీని నిర్వహిస్తున్న ఇన్ఫీ, తన లాభాల్లో 5.2 శాతం వాటాను దాని ద్వారానే ఆర్జిస్తోంది. ఇక ఈ దిశగా మరింత దూకుడు ప్రదర్శించాల్సిందేనన్న దిశగా అడుగులు వేస్తున్న ఇన్ఫోసిస్, లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రంగంలోకి దిగుతున్న సంస్థలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News