: ఖైరతాబాద్ భారీ గణేశుడికి 5 వేల కిలోల లడ్డూ ప్రసాదం
హైదరాబాదులో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల్లో మహా గణాధిపతికి మహా లడ్డూ ప్రసాదం తయారీ మంగళవారం మధ్యాహ్నం పూర్తయింది. తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో 5 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారుచేశారు. మల్లిబాబుతో పాటు లడ్డూ తయారీదారులందరూ ఈ నెల 21న గణపతి దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున లడ్డూ తయారీ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదం తయారీని ప్రారంభించారు. ముందుగా నేతితో తయారుచేసిన బూందీకి పంచదార పాకం పట్టి లడ్డూ తయారీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యంత్రంలో కలిపి... పెద్ద లడ్డూ బౌల్ లో వేసి భారీ లడ్డూ ఆకారం తయారుచేశారు. మధ్యాహ్నం 2.30కల్లా మహా లడ్డూ తయారీ పూర్తయింది. లడ్డూ ఆరిన తరువాత, దీనిని ఈ నెల 28వ తేదీన ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తరలిస్తారు.