: నవంబర్ లో సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన
ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నవంబరులో జపాన్ లో పర్యటించనున్నారు. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అంటున్న ఏపీ సీఎం, జపాన్ లోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించి, రాష్ట్రంలో అక్కడి కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరనున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే, ఏపీని 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలసి ఆర్థికాభివృద్ధికి కార్యాచరణ రూపొందించింది. నలభై మంది సభ్యులతో పరిశ్రమలు, పెట్టుబడుల పైన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉంటారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఈ కమిటీ మూడు నెలలకోసారి సమావేశమై పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చిస్తుంది.