: భారత్ కు హైస్పీడ్ రైళ్ళను విక్రయించేందుకు రేసులో ఆ 'ఇద్దరు'


నరేంద్ర మోడీ భారత్ పగ్గాలు చేపట్టిన తర్వాత దేశంలో ఆధునికత అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేలు కొత్తదనానికి పెద్దపీట వేయాలని నిర్ణయించాయి. వేగవంతమైన రైళ్ళను ప్రయోగాత్మకంగా పరీక్షించి, భారత్ లోనూ బుల్లెట్ ట్రైన్లు నడపడం సాధ్యమేనని ఓ అంచనాకొచ్చాయి. ఈ నేపథ్యంలో, వాణిజ్యపరంగా పోటీదారులైన చైనా, జపాన్ దేశాలు మనదేశానికి హైస్పీడ్ రైళ్ళను విక్రయించేందుకు పోటీపడుతున్నాయి. తన ప్రఖ్యాతిగాంచిన షింకాన్ సెన్ హైస్పీడ్ నెట్ వర్క్ భారత్ లో సాధ్యపడుతుందో? లేదో? అని జపాన్ ఈపాటికే అధ్యయనం మొదలుపెట్టింది. అందుకోసం అహ్మదాబాద్-ముంబయి మార్గంలో ప్రయోగాలు చేపట్టింది. ఈ వారాంతంలో ప్రధాని మోడీ జపాన్ పర్యటనకు వెళ్ళనున్నారు. మోడీతో భేటీ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబే తమ షింకాన్ సెన్ నెట్ వర్క్ ను కొనుగోలు చేయాల్సిందిగా కోరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు, చైనా కూడా జపాన్ కు పోటీగా రంగంలోకి దిగింది. ప్రపంచంలోనే అతిపొడవైన హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ చైనా సొంతం. జపాన్ కంటే తక్కువ ధరకే హైస్పీడ్ రైళ్ళను విక్రయించేందుకు సిద్ధమని ఈ ఆసియా దిగ్గజం సంకేతాలు పంపుతోంది. చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ సెప్టెంబర్ లో భారత్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత అధినాయకత్వంతో తమ రైళ్ళ విషయం ప్రస్తావించే అవకాశాలున్నాయి. మరి, మనవాళ్ళు నాణ్యమైన జపాన్ రైళ్ళను కొంటారో, చవకగా వస్తున్నాయని చైనా రైళ్ళను కొంటారో వేచి చూడాల్సిందే!

  • Loading...

More Telugu News