: డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇక ఆర్టీసీ వాతే!: మంత్రి సిద్ధా
పెట్రోలియం శాఖ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు భలేనచ్చినట్టుంది. అందుకే ప్రైవేటీకరణ కాకుండానే ప్రైవేటు స్థాయి సంస్కరణల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెట్రోలియం సంస్థలకే ధరల నియంత్రణ పగ్గాలు ఇచ్చినట్టుగా ధరల నిర్ణయం ఆర్టీసీ అధికారులకే అప్పగించేలా సంస్కరణలు చేపట్టనున్నారని సమాచారం. ఈ మేరకు డీజిల్ ధరలు పెరిగినపుడల్లా ఆర్టీసీ చార్జీలు కూడా వాటంతట అవే పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. సంస్థ ఇంధన ఖర్చును తగ్గించేందుకు బయో డీజిల్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన ఆయన, కర్ణాటకలో ఆర్టీసీ(కేఎస్ ఆర్టీసీ) పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపనున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకుంటామని ఆయన చెప్పారు.