: చెప్పులో రాయి సంగతేమో కానీ, చెవిలో జోరీగ చాలా ఇబ్బంది పెట్టింది!
మనల్ని వదలకుండా ఎవరైనా విసిగిస్తుంటే... ఏంట్రా, చెప్పులో రాయిలా, చెవిలో జోరీగలా వదలడం లేదు అంటుంటాం. చెప్పులో రాయి సంగతేమో తెలియదు కానీ, ఓ పెద్దమనిషిని జోరీగ మాత్రం వదల్లేదు. బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటుండగా ఎక్కడినుంచో వచ్చిన ఓ జోరీగ అతడి కళ్లజోడు మీద వాలింది. చదువుకు అంతరాయం కలిగిస్తుండడంతో ఫీల్డింగ్ మహాశయుడు దానిపై మండిపడ్డాడు. దీంతో, ఆ జోరీగ చటుక్కున అతని చెవిలో దూరి దాక్కుంది. కన్నం దొరకడంతో అది బయటకు రాకుండా అక్కడే సెటిలైపోయింది. దీంతో, ఫీల్డింగ్ తలలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించి నరకం అనుభవించాడు. దానిని బయటకు రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటకు రాలేదు. ఇలా మూడు రోజులు చెవిలో ఈగతో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక తన వల్ల కాదనుకుని ఆసుపత్రికి పరుగెత్తాడు. నర్సులు చెవిలో లైటు వేసి చూస్తే ఒక కాలు మాత్రమే వాళ్లకు కనపడిందట. జోరీగ చెవిలో దాదాపు 2 సెంటీమీటర్ల లోపల, కర్ణభేరికి సమీపంలో తిష్ట వేయడంతో చాలా నొప్పి పుట్టేదని ఫీల్డింగ్ తెలిపాడు. దీంతో, వైద్యులు ఓ గరాటును చెవిలో దూర్చి, మార్గాన్ని వెడల్పు చేసి, ఆ జోరీగను చిన్నపాటి శ్రావణం (ఫోర్సెప్స్)తో బయటకు తీశారు. అలా తీసే క్రమంలో ఆ జోరీగ మరణించింది. తనకు నరకం చూపించి, చివరికి మరణించిన ఆ జోరీగను ఫీల్డింగ్ భద్రంగా ఓ జార్లో దాచుకున్నాడు.