: ఫలించిన ఖతార్ కృషి... అమెరికన్ ను విడుదల చేసిన మిలిటెంట్లు
నాలుగు రోజుల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమెరికన్ జర్నలిస్టును అతి కిరాతకంగా చంపేసిన ఘటన ప్రపంచం మొత్తాన్ని వణికించింది. మరో విషయం ఏమిటంటే, ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో మరికొంత మంది అమెరికన్లు బంధీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, వీరందరు ప్రాణాలతో బయటపడగలరా? అనే భయం అందర్లోనూ నెలకొంది. అయితే, గల్ఫ్ దేశమైన ఖతార్ చేసిన కృషి ఫలించి... జర్నలిస్టు, రచయిత అయిన థియో కర్టిస్ అనే వ్యక్తిని నిన్న మిలిటెంట్లు క్షేమంగా విడిచిపెట్టారు. 2012లో సిరియాలోని నస్రా ఫ్రంట్ అనే తీవ్రవాద సంస్థ థియోను బంధీగా పట్టుకుంది. ఈ సంస్థకు ఆల్ ఖైదాతో అనుబంధం ఉంది. థియో విడుదలైన సంగతిని అమెరికా కూడా అధికారికంగా ప్రకటించింది. థియో క్షేమంగా విడుదలయినందుకు సంతోషంగా ఉందని... మిలిటెంట్ల చెరలో ఉన్న అమెరికన్లను విడుదల చేయించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు. సిరియాలో మరో 20 మంది జర్నలిస్టులు మిస్ అయ్యారని సమాచారం. వీరంతా ఐఎస్ఐఎస్ చెరలో ఉన్నారని భావిస్తున్నారు.