: వచ్చే ఐదేళ్లలో సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీ రెడీ!
విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయ ఇంధన వనరుల (నీరు, బొగ్గు, అణు)పైన ఆధారపడితే ఎప్పటికైనా ఇబ్బందేనని భావిస్తోన్న ఏపీ ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల( సూర్యరశ్మి, గాలి)పై దృష్టి పెట్టింది. సాంప్రదాయ ఇంధన వనరులను ఎల్లకాలం నమ్ముకోలేమని... వాటి వల్ల నష్టాలు (కాలుష్యం, రేడియేషన్ తదితరాలు) కూడా ఎక్కువేనని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో 9,000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీని సృష్టించడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా చాప కింద నీరులా కొన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే, క్లీన్ ప్రాజెక్ట్ (సోలార్, విండ్)లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి... ఏపీని 'గ్రీన్ కారిడార్'గా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి చేయబోయే 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో... 5,000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ద్వారా... మరో 4,000 వేల మెగావాట్లు పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయనున్నామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే ఎన్టీపీసీ, ఎన్వీవీఎన్ కంపెనీలు 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చిత్తూరు జిల్లాలో గానీ, అనంతపురం జిల్లాలో గానీ 1000 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు అనంతపురం జిల్లాలోనే మరో 100 మెగావాట్ల ప్లాంట్... గుంటూరు జిల్లాలో మరో 300 మెగావాట్ల ప్లాంట్ ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే విండ్ మిల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఏపీలో చాలా అవకాశాలున్నాయని జాతీయ పవన విద్యుత్ సంస్థ అభిప్రాయపడుతోంది. ఏపీలో 14,500 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని ఈ సంస్థ అభిప్రాయపడుతోంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పవన్ విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. పవన్ విద్యుత్ ను మొదట అనంతపురం జిల్లా రామగిరి కొండల్లో పెట్టారు. ఆ తర్వాత ఆత్మకూరు, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలకు విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం పథకం చేపట్టన 24 గంటల విద్యుత్ పైలట్ ప్రొజెక్ట్ లో ఢిల్లీ, రాజస్థాన్ లతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా చోట్టు దక్కింది. ఈ ప్రాజెక్ట్ క్రింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఏడాదికి 5,000 వేల కోట్లను ఇవ్వనుంది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉన్న చోటల్లా సోలార్ ,విండ్ ప్రాజెక్టులు ప్రారంభించి...రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.