: లాలూ-నితీశ్ ల దోస్తీ ఫలితం తేలేది నేడే!
సుదీర్ఘకాలం బీహార్ రాజకీయాల్లో వర్గ శత్రువులుగా కొనసాగిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ల దోస్తీ మంత్రం ఎలాంటి ఫలితాలనివ్వనుందన్న అంశం నేటి మధ్యాహ్నానికి తేలిపోనుంది. గత వారం ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో పది సీట్లు బీహార్ కు చెందినవే. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. మరోవైపు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను బీజేపీ ఎగరేసుకుపోయిన నేపథ్యంలో బద్ధ శత్రువుల మధ్య దోస్తీకి తెరలేచింది. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా మిగిలిన మూడు రాష్ట్రాల్లో 70 శాతం దాకా పోలింగ్ నమోదు కాగా, ఒక్క బీహార్ లో మాత్రం 47 శాతం ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఇదిలా ఉంటే, లాలూ-నితీశ్ దోస్తీతో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు జనం పెద్దగా హాజరు కాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన లాలూ ప్రసాద్ ఆస్పత్రిలో చేరారు. మరి ఆయనకు తీపి కబురందుతుందో, లేక మిత్రుడు నితీశ్, చేదువార్తనే చేరవేస్తారో వేచి చూడాల్సిందే.