: కొత్త పాక్ లో పెళ్లి చేసుకుంటా: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభానికి తెరతీసిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపారు. అయితే తనపెళ్లి ‘నూతన పాకిస్తాన్’ అనే స్వప్నం నెరవేరిన తరువాత జరుగుతుందని అన్నారు. 1995లో బ్రిటన్ కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న ఇమ్రాన్ కొత్తగా పెళ్లిపై ప్రకటన చేయడం పట్ల పలు ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఉన్నట్టుండి ఇమ్రాన్ పెళ్లి ప్రస్తావన తేవడం వెనుక రహస్యం ఏదో ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ వేలాది మంది మద్దతుదారులతో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి ప్రస్తావన తేవడం రాజకీయమేనా? లేక ఇతరులను పక్కదోవపట్టించేందుకేనా? అన్న చర్చ జరుగుతోంది.