: చెల్లిపై వేధింపులను అడ్డుకున్న అన్మదమ్ముల హత్య


ఉత్తరప్రదేశ్ లో మహిళలపై వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా వేధింపులను అడ్డుకున్నా సహించేది లేదని ఆ రాష్ట్ర మృగాళ్లు తేల్చిచెబుతున్నారు. అంతేనా, వేధింపులను అడ్డుకుంటే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బెదిరించమేంటీ, ఏకంగా అన్నంత పనీ చేశారు ఇద్దరు దుర్మార్గులు. తమ చెల్లిని వేధించొద్దన్నందుకు ఇద్దరు అన్మదమ్ములను వారు హత్య చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఫరీద్ పూర్ పరిధిలోని కర్పియాకు చెందిన అన్నదమ్ములు నరేంద్ర, రవీంద్రలు శనివారం దారుణంగా హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన అనిల్, సోమ్ వీర్ లు మరో వ్యక్తితో కలిసి అన్మదమ్ములిద్దరిపై పదునైన కత్తులతో దాడి చేశారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. నరేంద్ర, రవీంద్రల సోదరిని అనిల్, సోమ్ వీర్ తరచూ వేధిస్తున్నారట. వేధింపులు పెరగడంతో ఆ బాలిక అన్నలకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్, సోమ్ వీర్ లను అన్నదమ్ములిద్దరూ మందలించడంతో పాటు మరోమారు అలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నరేంద్ర, రవీంద్రలపై కక్ష పెంచుకున్న అనిల్, సోమ్ వీర్ అన్మదమ్ములిద్దరినీ హత్యచేసేందుకు తీర్మానించుకున్నారు. మరో వ్యక్తితో కలిసి శనివారం గ్రామంలోనే నరేంద్ర, రవీంద్రలపై విరుచుకుపడి... హత్య చేశారు. నరేంద్ర, రవీంద్రలను చంపిన అనిల్, సోమ్ వీర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News