: లోదుస్తులకు 'ఐఎస్ఐఎస్' పేరుపెట్టి, సారీ చెప్పారు!
బ్రిటన్ లోని ఆన్ సమ్మర్స్ అనే ఆన్ లైన్ అమ్మకాల సంస్థ తాజాగా కొన్ని లోదుస్తులను అమ్మకానికి పెట్టింది. కాగా, ఆ రేంజిని 'ఐఎస్ఐఎస్' పేరిట విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో, సదరు సంస్థ క్షమాపణ కోరింది. అయితే, ఆ లోదుస్తులను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐఎస్ఐఎస్ పేరిట ఇరాక్ లో మిలిటెంట్లు తీవ్ర విధ్వంసాలు సృష్టించడం తెలిసిందే. ఆన్ సమ్మర్స్ తన లోదుస్తులకు ఐఎస్ఐఎస్ (ఇసిస్) పేరు పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. ఈజిప్టుకు చెందిన సంతాన దేవత పేరు 'ఇసిస్'. ఆ పేరు స్పెల్లింగు కూడా ఐఎస్ఐఎస్ కావడంతో ఈ చిక్కొచ్చిపడింది. దీనిపై ఆన్ సమ్మర్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, తాము స్టాక్ విడుదల చేసిన సమయం బాగోలేదన్నారు. ఇదే సమయంలో ఇరాక్ లో తీవ్రవాద దాడులు జరుగుతుండడంతో తమ లోదుస్తులు వివాదాస్పదమయ్యాయని తెలిపారు. తాము ఈ రేంజిని లాంచ్ చేయడానికి నెలల ముందే 'ఇసిస్' (ఐఎస్ఐఎస్) పేరు పెట్టామని ఆమె చెప్పారు. ఏదేమైనా తాము తీవ్రవాదాన్ని, హింసను ఎన్నడూ సమర్థించబోమని తెలిపారు. ఇలా జరగడం పట్ల క్షమాపణ తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇరాక్ లో నెత్తుటి చరిత్ర లిఖిస్తున్న ఐఎస్ఐఎస్ అంటే... ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని అర్థం.