: ఫుల్ గా తాగేసి, విమాన సిబ్బంది బట్టలు చించేశాడు!
పూటుగా తాగేసి.. వీరంగమేసిన హైక్లాస్ ప్రయాణికుడ్ని సీటుకి కట్టేసిన ఘటన ఎయిరిండియా విమానంలో చోటు చేసుకుంది. ఎయిరిండియాలో ప్రయాణికులకు అందించే సేవలు అద్భుతమని విమానమెక్కిన వారెవరైనా సరే చెబుతారు. అయితే, మెల్ బోర్న్ నుంచి ఢిల్లీకి వచ్చే ఎయిరిండియా విమానంలో ఓ 27 ఏళ్ల ప్రబుద్దుడు పూటుగా తాగేసి విమాన సిబ్బందిపై చిందులేశాడు. ఇద్దరి దుస్తులు చించేశాడు... అంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను కొరకడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికుల సాయంతో తాళ్లు, వైర్లతో అతగాడిని సీటుకు కట్టేసి 12 గంటల పాటు ఉంచారు. ఇతర ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని దారిమళ్లించి సింగపూర్లో ఆపమంటారా? అని పైలట్ ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా, విమాన ప్రయాణం ఆలస్యం అవుతుందని బావించి, వారు వద్దనడంతో నేరుగా ఢిల్లీ తీసుకొచ్చారు. దీంతో విమానం ఢిల్లీలో ఆగగానే సదరు తాగుబోతు ప్రయాణికుడిని అరెస్టు చేసి, అతడి మీద కేసు నమోదు చేశారు.