: అక్కడ సంపూర్ణ మద్య నిషేధం... ఇక్కడ సంపూర్ణ మద్య వినియోగం!
కేరళలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిశ్చయించింది. మద్యనిషేధం అమలు చేయడం ద్వారా పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. పక్క రాష్ట్రాలు మద్య నిషేధం అమలు చేయాలని యోచిస్తోంటే... ఇక్కడ మాత్రం సంపూర్ణ మద్య వినియోగం అమల్లో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పలు చోట్ల గుడి, బడి సమీపంలోనే వైన్ షాపులు మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇక, హైదరాబాదు సహా విశాఖ, విజయవాడ నగరాల్లో అయితే వీధికొక బార్ ఉంది. వీటికి తోడు గ్రామ గ్రామాన బెల్టు షాపులకు లెక్కే లేదు. హైదరాబాదులో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన రోజున నగరం మొత్తం బంద్ జరిగింది. చివరికి నగరవాసులకు భోజనం, టీ దొరకలేదు... కానీ, వైన్ షాపులు మాత్రం యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని కొనసాగించాయి. ఇదీ, ఇక్కడి ‘సంపూర్ణ మద్య వినియోగం’ తీరు.