: సినిమాల్లోనే బెటర్, డైలాగులుంటాయి... రాజకీయాల్లో ఆమెది బొత్తిగా గెస్టు అప్పీరియన్స్ అయిపోయింది!
కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని భావిస్తే మౌనం వహిస్తాం. మరి ప్రతి నిర్ణయం తప్పైపోతేనో... సినిమాల్లో ఇక అవకాశాలు లేవు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం విజయశాంతిని లైమ్ లైట్ లో నిలబెట్టింది. ఉద్యమంలో అప్పుడప్పుడు కనిపించి డైలాగ్ క్వీన్ గా దర్శనమిచ్చి తన ఉనికిని చాటుకునేందుకు ‘తల్లి తెలంగాణ’ పార్టీ స్థాపించిన ప్రముఖ నటి విజయశాంతి మొదట్లో ఓ వెలుగు వెలిగారు. కాలక్రమేణా పార్టీ నడపడం అంత తేలికైన పని కాదని రాములమ్మకి తెలిసిపోయింది. దాంతో, తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీగా ఎన్నికైంది. అక్కడ ఆమె పాత్ర పార్టీ అధినేత పక్కన కూర్చోవడం, మాట్లాడమంటే మాట్లాడడం అంతే. దీంతో, పార్టీ నేతలపై పట్టుపోయింది. టీఆర్ఎస్ లో ఆమెకి ఉనికి లేకుండా పోయింది. దీంతో రాములమ్మ మౌనం వహించింది. ఎంపీగా ఐదేళ్లు మౌనముని పాత్ర పోషించిన విజయశాంతి.. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఊపిరి పీల్చుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని భావించి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. అధిష్ఠానం ఆదేశంతో మెదక్ లోక్ సభ స్థానాన్ని మరొకరికి ఇచ్చి శాసనసభకు పోటీచేసి పరాజయం పాలైంది. దీంతో ఆమె పూర్తిగా మౌనం దాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి తరువాత ఆమె ఎక్కడా కనిపించలేదు సరికదా మాట కూడా వినిపించలేదు. తాజాగా తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేకు దూరంగా ఉండి తన నిరసన తెలిపి మరోసారి మీడియాను ఆకర్షించింది. దీంతో ఆమె భవిష్యత్ పై రాజకీయ, సినీ రంగాల్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లోనే విజయశాంతి పరిస్థితి నయమని, రచయిత రాసిన డైలాగులన్నా చెప్పేదని...రాజకీయాల్లో బొత్తిగా గెస్టు అప్పీరియెన్స్ అయిపోయిందని టాక్ విన్పిస్తోంది.