: అన్నార్తుల కోసం వస్తున్న ‘అన్న క్యాంటీన్లు’


నిరుపేదల కడుపు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్’లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ఆదరణ పొందిన ‘అమ్మ’ క్యాంటీన్ల మాదిరిగా... రాష్ట్రంలో ‘అన్న’ క్యాంటీన్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తొలుత గుంటూరు జిల్లాలో క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కూలీ పనులు చేస్తూ అర్థాకలితో అలమటించే వారి కోసం ప్రత్యేకంగా ‘అన్న’ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేసి... తక్కువ ధరకే భోజనం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆంద్రప్రదేశ్ లో ఏర్పాటవుతున్న ‘అన్న’ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారానికి రూ.5, సాంబారు అన్నం రూ.7.50 అందించాలని నిర్ణయించారు. అలాగే చపాతీలను కూడా రూ.7.50కే అందించాలని యోచిస్తున్నారు. చెన్నైలో మాదిరిగానే అన్న క్యాంటీన్ల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పౌర సరఫరాల శాఖ అధికారి చైతన్య చెప్పారు. త్వరలోనే వీటికి సంబంధించిన మార్గదర్శకాలు రాగానే గుంటూరు జిల్లాలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. పేదవారి క్షుద్బాధను తీర్చే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News